కెప్టెన్ శతకం వృథా.. రెండో వన్డేలో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

మొహాలీ: మూడు అనధికారిక వన్డేలు, మూడు అనధికారిక టి-20లు, ఒక అనధికారిక టెస్ట్ ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళల ఎ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా టి-20 సిరీస్‌ను కంగారూ జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌కు పరాజయం తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 338 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. కెప్టెన్ యస్తికా భాటియా సెంచరీతో చెలరేగింది. 84 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 112 పరుగులు చేసింది. ఇక తేజల్ హసాబ్నిస్ (60), అనుష్క శర్మ (60 నాటౌట్) అర్థ శతకాలు సాధించారు. ఆసీస్ బౌలింగ్‌లో డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు, మిల్లీ ఇల్లింగ్‌వర్త్ రెండు వికెట్లు, లల్లీ మిల్స్ ఒక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ నికోలి ఫాల్తుమ్(12)ను సయాలీ సత్గరే తక్కువ స్కోర్‌కే పెవిలియన్ పంపింది. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ తాహిలా విల్సన్ (79), అనికా లిరాయిడ్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక చార్లి నాట్ 37 బంతుల్లోనే 63 పరుగులతో అదరగొట్టింది. హేలీ సిల్వర్ హోమ్స్ (47), టెస్ ఫ్లింటాఫ్ (38) పరుగులతో రాణించారు. అయితే భారత బౌలర్లు విజయం సాధించడానికి ఆఖరి వరకూ పోరాడారు. కానీ, విజయం మాత్రం ఆసీస్‌ని వరిచింది. 49.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆసీస్ 341 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఈ సిరీస్‌ని 1-1 తేడాతో సమం చేసింది. మూడో వన్డే శుక్రవారం మొహాలీ వేదికగా జరగనుంది.
-
Home
-
Menu
