ఆటో డ్రైవర్ కొడుకు.. డాక్టర్ కాబోతున్నాడు!

నీట్ లో 627 మార్కులు.. కెజిఎంయు లో ఎంబిబిఎస్ సీటు, తండ్రి 20 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం
లక్నో: ముంబై వీధుల్లో దాదాపు 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబ భవిష్యత్తు కోసం శ్రమించిన తండ్రి.. తన కుమారుడి విజయంతో గర్వపడే రోజు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా దేవ్‌కిపూర్‌కు చెందిన ప్రభాత్ కుమార్ యాదవ్ నీట్ యుజి 2026లో 627 మార్కులు సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 3,864తో కెజిఎంయులో ఎంబిబిఎస్ సీటు సాధించాడు. ప్రభాత్ విజయం వెనుక అతడి తండ్రి మహేంద్ర కుమార్ యాదవ్ చేసిన ఎన్నో ఏళ్ల త్యాగం ఉంది. కుటుంబానికి దూరంగా ముంబైలోని చిన్న చాల్‌లో ఉంటూ ఆటో నడిపిన మహేంద్ర.. తన సంపాదనను ఇంటికి పంపిస్తూ పిల్లల చదువుకు అండగా నిలిచాడు.
గ్రామంలో తల్లి బన్సరాజీ, తాత ఇంద్ర బహదూర్ యాదవ్, తోబుట్టువులతో కలిసి పెరిగిన ప్రభాత్.. తండ్రి కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైద్యుడిగా ఎదగాలనే లక్ష్యంతో చదువుపై దృష్టి పెట్టాడు. ఎలాంటి ఆర్భాటాలు లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రభాత్.. పట్టుదలతో నీట్ లో మంచి ర్యాంక్ సాధించి ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో సీటు దక్కించుకున్నాడు. ఈ వార్తతో దేవ్‌కిపూర్‌లో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 20 ఏళ్ల తండ్రి శ్రమ.. కుమారుడి ఒక్క విజయంతో సార్థకం. ప్రభాత్ విజయం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పట్టుదల, కష్టపడి చదవడం, కుటుంబ సహకారం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశాన్ని ఇస్తోంది.
Tags
-
Home
-
Menu
