ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను తరలిస్తున్న ఆటో బోల్తా..నలుగురు విద్యార్థులకు గాయాలు

auto overturned
X

auto overturned

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీసుకెళ్తుండ గా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ సంఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠ్యపుస్తకాలను ఆటోలో తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆటో టైర్ పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జెడ్పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలకు పార్ట్ 2 పాఠ్య పుస్తకాలను ఆటోలో తరలించేందుకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను పుస్తకాలను తరలించేందుకు వినియోగించారు. సాతాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు టైరు పేలి ఆటో బోల్తా కొట్టింది.

9వ తరగతి చదువుతున్న కార్తీక్, అశోక్, నాని, శివ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో శివ అనే విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులను పాఠ్యపుస్తకాలు తరలించేందుకు వినియోగించడం పై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌ను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం ఫై విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సంఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి శివకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.

Tags

Next Story