అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో మార్మోగిన యాదాద్రి

అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో మార్మోగిన యాదాద్రి
X

అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో యాదాద్రి కొండలు మార్మోగాయి. భక్తుల ఇలవేల్పు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గిరిప్రదక్షిణను అయ్యప్ప స్వాములు శరణు.. శరణు..నారసింహ..స్వామియే శరణమయ్యప్పా అంటూ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కొండ కింద గల పాదాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామిని ఊరేగిస్తూ గిరిప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో యాదాద్రి పరిసర ప్రాంతాలు నారసింహుడి నామస్మరణతో మార్మోగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు గిరిప్రదక్షిణలో పాల్గొని సందడి చేశారు. గిరిప్రదక్షిణ అనంతరం అయ్యప్ప స్వాములందరూ కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములకు నేరుగా గర్భాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు కల్పించారు. అయ్యప్ప స్వాములకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.


గిరిప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉంది ః ఎమ్మెల్యే

అయ్యప్ప స్వాములతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అయ్యప్పస్వాములతో కలిసి ఆయన గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అయ్యప్పలతో కలిసి కొండపైకి కాలినడకన వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండోసారి కూడా అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ నిర్వహించడం సంతోషంగా ఉందని, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిప్రదక్షిణలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో వెంకట్రావు, బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి, బాసర పీఠాధిపతి, గో పాదయాత్ర నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి, అనిల్ గురుస్వామి, పెండెం శ్రీనివాస్‌తో పాటు అయ్యప్పస్వాములు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయ్యప్ప స్వాముల కోసం ట్రాఫిక్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వాములు ఏ రూట్లో వచ్చే వారి కోసం ఆ రూట్లోనే పార్కింగ్ సౌకర్యం కల్పించిట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. అటు స్థానికులకు, ఇటు అయ్యప్ప స్వాములకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

Tags

Next Story