కెటిఆర్ పై అంత ప్రేమ ఎందుకు ఎస్పీ.... కావాలంటే బిఆర్ఎస్ లో చేరు: బండి సంజయ్

సిరిసిల్ల: ప్రధాని నరేంద్ర మోడీ దిగ్విజయంగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్భంగా యువ, రైతు, మేధావుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో బండి మీడియాతో మాట్లాడారు. పిఎం నరేంద్ర మోడీ పాలనలో సాధించిన విజయాలు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కరీంనగర్ జిల్లాలో స్వచ్ఛ పాఠశాల పేరుతో మన పాఠశాల, మన బాధ్యతతో స్కూళ్లను శుభ్రం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పేరుతో 20 వేల సైకిళ్లను అందజేశామన్నారు. కొందరు విద్యార్థులకు పరీక్ష ఫీజులు కూడా తానే చెల్లించానని తెలియజేశారు. సిరిసిల్ల ఎస్పి మహేష్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పర్యటనకు వస్తే ఎస్పీ గైర్హాజరు కావటం ఏంటని ప్రశ్నించారు. ఎస్పికి బిజెపి కార్యకర్తలంటే కోపమెందుకు? అని అడిగారు. ఎస్పీకి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అంత ప్రేమ ఎందుకు? అని, బీఆర్ఎస్‌పై అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలోనే చేరాలని ఎస్ పికి బండి సంజయ్ చురకలంటించారు.
-
Home
-
Menu
