కెటిఆర్.. నా జోలికొస్తే రోడ్డుకీడుస్తా: బండి సంజయ్

Bandi Sanjay
X

సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాజకీయ వ్యభిరచారి అంటూ మండిపడ్డారు. గాంధీ భవన్‌లో పార్టీ ఫిరాయింపుల సంసారం పెట్టారని.. అది కనిపించడం లేదా అని స్పీకర్‌ను సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు.

ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గాంధీ భవన్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారని.. జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మీటింగుల్లో.. వాళ్లే బీఫాంలు పంచుతున్నారని అన్నారు. ‘‘స్పీకర్ గారు అయినా మీ కళ్లకు కనిపించడం లేదా? స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా? ప్రజలారా.. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటు వేయాలో అని అడగండి’’ అని సంజయ్ పేర్కొన్నారు.

తమకు భయపడి కెటిఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘కెటిఆర్.. నా జోలికొస్తే రోడ్డుకీడుస్తా. కేంద్రం నిధులిస్తే.. ఆ నిధులను తినేసి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయా పైసా ఇవ్వలేదు. కాంగ్రెస్ వద్దనే పైసలు లేవు. వాళ్లకి ఎందుకు ఓటేయాలి? అందుకే ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు. మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే ఐదేళ్ల అరిగోస తప్పదు’’ అని సంజయ్ అన్నారు.

Tags

Next Story