కుక్కల్లో జ్వరం, దగ్గు కనిపిస్తున్నాయా? డిస్టెంపర్‌పై అప్రమత్తంగా ఉండండి!

కుక్కల్లో జ్వరం, దగ్గు కనిపిస్తున్నాయా? డిస్టెంపర్‌పై అప్రమత్తంగా ఉండండి!
X

పెంపుడు కుక్కకు చిన్న జ్వరమొచ్చినా నిర్లక్ష్యం వద్దు.. ప్రాణాలకే ముప్పు తెచ్చే వైరస్!

మన తెలంగాణ – హెల్త్ డెస్క్: ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకునే కుక్క కాస్త నీరసంగా కనిపించినా, ఆహారం ముట్టకపోయినా, కళ్ల నుంచి నీళ్లు కారినా వెంటనే అప్రమత్తం కావాలి. ‘చిన్న జ్వరమే కదా.. తగ్గిపోతుందిలే’ అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సాధారణ లక్షణాల వెనుక కుక్కల ప్రాణాలకే ముప్పు తెచ్చే కెనైన్ డిస్టెంపర్ అనే ప్రమాదకర వైరస్ దాగి ఉండవచ్చు. ముఖ్యంగా టీకాలు వేయించని కుక్కపిల్లలకు ఈ వ్యాధి సోకితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

తన పెంపుడు కుక్క పరిస్థితిని గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాలీవుడ్ నటి సమీరా రెడ్డికి కూడా తన పెంపుడు కుక్క బ్రూనీ అనారోగ్యంతో బాధపడినప్పుడు ఈ వైరస్ తీవ్రత తెలిసివచ్చింది. కెనైన్ డిస్టెంపర్ సోకడంతో బ్రూనీ ప్రాణాపాయ స్థితికి చేరుకుందని ఆమె గతంలో సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. సరైన సమయంలో చికిత్స, సంరక్షణ అందించడం ఎంత ముఖ్యమో వివరించారు. పెంపుడు జంతువుల విషయంలో ముందస్తు టీకాలను నిర్లక్ష్యం చేయవద్దని ఇతర పెంపుడు జంతువుల యజమానులకు సూచించారు.

ఏమిటీ ప్రాణాంతక వైరస్?

కెనైన్ డిస్టెంపర్ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది కుక్కల శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థపై కూడా దాడి చేస్తుంది. తొలుత జ్వరం, దగ్గు, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలతో మొదలై.. వ్యాధి ముదిరే కొద్దీ నాడీ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా టీకాలు వేయించని కుక్కల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఒక కుక్క నుంచి మరో కుక్కకు ఎలా వ్యాపిస్తుంది?

ఈ వైరస్ ప్రధానంగా వ్యాధి సోకిన కుక్కల నుంచి ఇతర కుక్కలకు వ్యాపిస్తుంది. సోకిన కుక్క దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. లాలాజలం, కళ్ల నుంచి వచ్చే స్రావాలు, ముక్కు స్రావాలు, మలం, మూత్రంతో సంపర్కం వల్ల ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఒకే ఆహార పాత్రలు, నీటి గిన్నెలు, బొమ్మలు, పడకలను ఉపయోగించడం వల్ల కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నక్కలు, తోడేళ్లు, ముంగిసలు వంటి కొన్ని అడవి జంతువులు కూడా వైరస్‌కు వాహకాలుగా ఉండవచ్చు. గర్భిణీ కుక్కకు ఇన్ఫెక్షన్ ఉంటే గర్భంలోని పిల్లలకు కూడా వ్యాపించవచ్చు.

వ్యాధి ప్రారంభ దశలో కనిపించే లక్షణాలను చాలామంది సాధారణ జలుబు, జ్వరం లేదా జీర్ణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్ని సంకేతాలు ప్రమాదాన్ని సూచిస్తాయి.

ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు:

కళ్ల నుంచి, ముక్కు నుంచి నీరు లేదా చీము రావడం.

జ్వరం తగ్గినట్లు అనిపించి మళ్లీ పెరగడం.

ఆహారం తినకపోవడం, తీవ్రమైన నీరసం.

బరువు తగ్గడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

వాంతులు, దుర్వాసనతో కూడిన విరేచనాలు.

ముక్కు, పాదాల అడుగు భాగంలోని చర్మం గట్టిపడటం.

వ్యాధి తీవ్రత పెరిగితే..

శరీరం వణకడం, కండరాలు అదరడం.

నమిలినట్లుగా దవడలు పదేపదే కదలడం.

తల ఒకవైపునకు వాలిపోవడం.

నడకలో సమతుల్యత కోల్పోవడం.

ఫిట్స్ రావడం.

తీవ్రమైన సందర్భాల్లో పక్షవాతం వంటి సమస్యలు తలెత్తడం.

ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే ఇంటి చిట్కాలతో కాలయాపన చేయకుండా వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

వ్యాధి వస్తే చికిత్స ఉందా?

ప్రస్తుతం కెనైన్ డిస్టెంపర్ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే నిర్దిష్ట యాంటీవైరల్ మందు అందుబాటులో లేదు. అయినప్పటికీ వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యులు సహాయక చికిత్స అందిస్తారు. శరీరంలో ద్రవాల లోపం రాకుండా సెలైన్, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నియంత్రణకు యాంటీబయాటిక్స్, ఫిట్స్ తగ్గించేందుకు అవసరమైన మందులు ఇస్తారు. కుక్క ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స కొనసాగిస్తారు. వ్యాధి తీవ్రత, చికిత్స ప్రారంభించిన సమయం, కుక్క రోగనిరోధక శక్తిని బట్టి కోలుకునే అవకాశాలు మారుతాయి.

టీకాలే అసలైన రక్షణ కవచం!

ఈ వైరస్ బారిన పడకుండా పెంపుడు కుక్కలను కాపాడుకోవడానికి టీకాలు అత్యంత కీలకం. సాధారణంగా కుక్కపిల్లలకు 6–8 వారాల వయసులో డిహెచ్ పిపి/ డిఎపిపి టీకా మొదటి డోసు ఇస్తారు. పశువైద్యుడి సూచన మేరకు తదుపరి బూస్టర్ డోసులు వేయించాలి. అనంతరం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బూస్టర్ టీకాలు కొనసాగించాలి. టీకాలు పూర్తికాని కుక్కపిల్లలను బయట పార్కులకు తీసుకెళ్లడం, ఇతర కుక్కలతో కలపడం తగ్గించాలి. కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన లేదా వీధి నుంచి రక్షించిన కుక్కను ఇతర పెంపుడు జంతువులకు దూరంగా ఉంచి, పశువైద్యుడి సూచన మేరకు 2–4 వారాల పాటు పర్యవేక్షించాలి. ఆహారం, నీటి పాత్రలు, బొమ్మలు, పడకలను శుభ్రంగా ఉంచాలి.

ప్రేమ చూపించడమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ బాధ్యతే!

పెంపుడు కుక్కలు మాటలతో తమ బాధను చెప్పలేవు. వాటి ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పులే అనారోగ్యానికి ముందస్తు సంకేతాలు కావచ్చు. జ్వరం, కళ్ల నుంచి నీళ్లు కారడం, ఆహారం తినకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా టీకాలు వేయించని కుక్కల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. సమయానికి టీకాలు, పరిశుభ్రత, తగిన వైద్య పరీక్షలు ఉంటే ఈ ప్రమాదకర వైరస్ ముప్పును తగ్గించవచ్చు. మన ఇంట్లో ఒక సభ్యుడిలా పెరిగే మూగజీవి ఆరోగ్యాన్ని కాపాడటం మన బాధ్యత కూడా!


Tags

Next Story