ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పరమశివుడిని ప్రార్థించాను: భట్టి

Bhatti prayed to Lord Shiva for People
స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క దంపతుల ప్రత్యేక పూజలు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలని పరమ శివుడిని వేడుకున్నా
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి
ఖమ్మం: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ఆదాయ వనరులు పెరిగి, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ప్రపంచంతో పోటీపడి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను దాటి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆ పరమశివుని వేడుకున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు భట్టి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడమే కాకుండా, ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము.
స్నానాల లక్ష్మీపురం క్షేత్రంపై భక్తులకు ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడి నదిలో స్నానమాచరించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమని అన్నారు. స్నానాల లక్ష్మీపురంలో మూడు రోజుల పాటు జరిగే తిరునాళ్లకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు పోటెత్తే భక్తుల కోసం ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా పరమశివుడ్ని దర్శించుకుని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి దంపతులకు డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవాలయానికి చేరుకున్న వారికి ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానించారు. మహాశివరాత్రి పుణ్యకాలం సందర్భంగా భట్టి విక్రమార్క దంపతులు రామలింగేశ్వర స్వామి వారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. లోకకల్యాణం కోసమే ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధి పురోగతి పనుల పరిశీలన
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం,ఆలయ ఆవరణలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నానాల ఘాట్, కళ్యాణ మండపం, రథశాల పనులతో పాటు వైరా నదిపై నిర్మించిన రిటైనింగ్ వాల్‌ను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మిస్తున్న చిన్న ఫంక్షన్ హాల్ భవిష్యత్తులో శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తులతో పాటు వైరా పరిసర గ్రామాలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలకు ఎంతో ఉపయోగపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మూడు రోజుల పాటు సాగే తిరునాళ్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, వివిధ స్టాల్స్, జాయింట్ వీల్‌ను ఆయన సందర్శించారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా, చిరునవ్వుతో వారితో కలిసి ఫొటోలు దిగి సందడి చేశారు.
-
Home
-
Menu
