రియల్టీకి జోష్

ఆర్‌బిఐ రెపో రేటు కోతతో హోమ్ లోన్లు చౌక
బ్యాంకులు మరింతగా రేట్లు తగ్గించే సూచనలు
న్యూఢిల్లీ: ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) నిర్ణయం గృహ రుణగ్రహీతలకు పెద్ద ఊరటనిచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గింపు వల్ల గృహ రుణాల వడ్డీ రేట్లు 2008 ఆర్థిక సంక్షోభానికి ముందున్న స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. తాజాగా రిజర్వు బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకువచ్చింది. ఆర్‌బిఐ నిర్ణయం అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) రెపో ఆధారిత వడ్డీ రేట్లను 0.25 శాతం మేరకు తగ్గించింది. ఇతర బ్యాంకులు కూడా ఈ రేటు తగ్గింపును అనుసరించే అవకాశముంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.35 శాతం వద్ద గృహ రుణాలను ఇస్తున్నాయి. రెపో రేటు తగ్గుదలతో ఈ రేటు 7.1 శాతం వరకు తగ్గే అవకాశముంది. 15 సంవత్సరాల గృహ రుణంపై వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుతో ప్రతి నెల దాదాపు 1,440 రూపాయల ఇఎంఐ తగ్గింపు ఉండొచ్చని అంచనా.
అయితే ఈ తగ్గింపును అమలు చేయాలంటే బ్యాంకులు డిపాజిట్ రేట్లను గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది లేదా బెంచ్‌మార్క్ రేటు మార్చాల్సి వస్తుంది. అలా జరిగితే కొత్త రుణగ్రహీతలు, ఇప్పటికే ఫ్లోటింగ్ రేటు రుణం ఉన్నవారితో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటు చెల్లించే పరిస్థితి రావచ్చు. డిపాజిట్ రేట్లు తగ్గించకపోతే బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు తగ్గుతాయి. కానీ బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు తక్కువ నిధుల ఖర్చుల వల్ల త్వరగా లాభం పొందుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ఫైనాన్షియర్లకు ఈ విధానం ఎక్కువ మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 1 లక్ష కోట్ల విలువైన ఒఎంఒ కొనుగోళ్ల ప్రకటనతో కలిసి తటస్థ విధాన వైఖరి ద్రవ్యతను మరింత బలపరుస్తుందని అంటున్నారు. గోల్డెన్ గ్రోత్ ఫండ్ సిఇఒ అంకుర్ జలాన్ మాట్లాడుతూ, రెపో రేటు తగ్గింపుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబడి తగ్గుతుందని, సేవింగ్ చేసేవారికి మెరుగైన వడ్డీ రేట్లు కష్టమవుతాయని అన్నారు.
తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహిస్తాయని, పెద్ద పెట్టుబడిదారులు అధిక రాబడిచ్చే రియల్ ఎస్టేట్ ఆధారిత ఫండ్లవైపు దృష్టి మళ్లించే అవకాశం అన్నారు. అగ్రశిల్ ఇన్‌ఫ్రాటెక్ సిఇఒ ప్రేక్ష సింగ్ మాట్లాడుతూ, భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే ప్రపంచ పెట్టుబడిదారులు, ఎన్‌ఆర్‌ఐలకు ఆకర్షణీయంగా మారిందని, ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గుదల దానిని మరింత లాభదాయక పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపుతుందని పేర్కొన్నారు. తక్కువ ఇఎంఐలు, పెరుగుతున్న డిమాండ్, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిసి రాబోయే త్రైమాసికాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊపు తెస్తాయని ఆమె అంచనా వేశారు.
Tags
-
Home
-
Menu
