చెత్తపై యువకుడి పోరాటం.. సిఇఒ ఫిదా!

చెత్తపై యువకుడి పోరాటం.. సిఇఒ ఫిదా!
X

‘బిట్టూ తబాహీ’కి ఆర్థిక సాయం చేస్తానన్న భారత్‌ అగ్రి సిఇఒ

న్యూఢిల్లీ: చేతిలో గ్లౌజులు.. భుజాన చెత్త సంచి.. కాలుష్యంపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 20 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్‌ చౌదరి అలియాస్‌ ‘బిట్టూ తబాహీ’ ఇప్పుడు మరింత మందిని ఆకట్టుకుంటున్నాడు. నదులు, అటవీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తూ తనదైన శైలిలో శుభ్రత ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఓ నదిని, కర్ణాటకలో అటవీ ప్రాంతాన్ని శుభ్రం చేసిన బిట్టూ.. తాజాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో యమునా పరిసరాల్లో క్లీన్ విత్ బిట్టు కార్యక్రమాన్ని చేపట్టాడు. సెప్టెంబర్‌ 20న ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమంలో వాలంటీర్లతో కలిసి భారీగా చెత్తను తొలగించాడు. తొలిరోజు యమునా నది ఒడ్డున 585 కిలోలు, గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలా ప్రాంతంలో 2,435 కిలోల వ్యర్థాలను సేకరించారు.

యువకుడి సేవలకు సిఇఒ ప్రశంసలు

బిట్టూ చేస్తున్న సేవలను గమనించిన బెంగళూరుకు చెందిన భారత్‌అగ్రి వ్యవస్థాపకుడు, సిఇఒ సిద్ధార్థ్‌ డయాలానీ సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసించారు. బిట్టూ పని తనకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్న ఆయన.. యువకుడి కార్యక్రమాలకు ఆర్థికంగా సహకరించాలనుకుంటున్నట్లు తెలిపారు. బిట్టూతో తనను సంప్రదింపజేయాలని కోరిన సిద్ధార్థ్‌.. అతడి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలనుకునే మరికొందరి నుంచి కూడా నిధులు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సిఇఒ స్పందనతో పలువురు నెటిజన్లు కూడా బిట్టూ కార్యక్రమాలకు మద్దతు ప్రకటించారు. తమ ప్రాంతాల్లోనూ చెత్త తొలగింపు, చెత్తబుట్టల ఏర్పాటు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న విషయాలను కొందరు పంచుకున్నారు. ఒక్క యువకుడి ప్రయత్నం.. ఎంతో మందికి స్ఫూర్తి. బిట్టూ తబాహీ శుభ్రత కార్యక్రమాలు సోషల్‌ మీడియాలో అతడిని ప్రశంసిస్తున్నారు. యువకుడి స్పూర్తితో పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి.

Tags

Next Story