రైల్లో 40 మంది హంగామా..... ‘ట్రామాటిక్ జర్నీ’ అంటూ ఎంపి భార్య ఫైర్

BJP MP Tejasvi Suryas wife traumatic train journey
X

BJP MP Tejasvi Surya's wife traumatic train journey

బెంగళూరు: రైలు ప్రయాణంలో ఎదురైన ఓ అనుభవాన్ని ప్రముఖ కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దాదాపు 40 మంది ప్రయాణికులు కోచ్‌లో నిరంతరం గట్టిగా మాట్లాడటం, నవ్వుకోవడం, పాటలు వినడం వల్ల తన ప్రయాణం “ట్రామాటిక్”గా మారిందని బిజెపి ఎంపి తేజస్వీ సూర్య భార్య శివ శ్రీ అసహనం వ్యక్తం చేశారు.

ఐదు గంటల పాటు అదే పరిస్థితి

తన ఎక్స్‌ ఖాతాలో ఆమె పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. పబ్లిక్‌ ప్లేసుల్లో ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని, ప్రశాంతతను గౌరవించాలని కోరారు. తనకు కళాకారిణిగా నిశ్శబ్దం ఎంతో ముఖ్యమని, కానీ కోచ్‌లోని సుమారు 40 మంది మధ్యవయస్కుల బృందం దాదాపు ఐదు గంటల పాటు నిరంతరం పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నారని తెలిపారు. పెద్దగా మాట్లాడటం, అరవడం వంటి వాటికి పబ్లిక్‌ ప్లేసుల్లో దూరంగా ఉండాలని, ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాలని ఆమె పేర్కొన్నారు.

టిటిఇని ఆశ్రయించినా..

తీవ్ర అసౌకర్యానికి గురైన శివశ్రీ కోచ్‌ మార్చుకునేందుకు టికెట్‌ తనిఖీ అధికారిని సంప్రదించారు. అయితే రైలు పూర్తిగా నిండిపోవడంతో మరో కోచ్‌కు మార్చడం సాధ్యం కాలేదని, చివరకు అదే కోచ్‌లో మరో సీటు మాత్రమే ఇచ్చారని ఆమె తెలిపారు.

ప్లేయింగ్ కార్డు ఆటతో (యుఎన్ఒ) మళ్లీ ఇబ్బంది

ఇంతలో ఎనిమిది మంది ప్రయాణికులు కలిసి యుఎన్ఒ కార్డులు ఆడటం ప్రారంభించారని శివశ్రీ చెప్పారు. అప్పటికే గట్టిగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటున్న వారు కార్డులు ఆడటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. దీంతో ఆమె మరోసారి టిటిఇని సంప్రదించారు. ప్రయాణికులను కార్డులు ఆడటం ఆపాలని టిటిఒ కోరగా.. వారు వెంటనే ఆపారని ఆమె పేర్కొన్నారు.

అయితే కొద్దిసేపటి తర్వాత టిటిఇ తిరిగి వచ్చి, ఎందుకు గోల చేస్తున్నారు? అంటూ వారిని ప్రశ్నించారని తెలిపారు. అందుకు వారు నవ్వుతూ, సార్.. మీరు కూడా రండి, ఆడదాం అని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

ఇది యుఎన్ఒ గురించి కాదు.. సివిక్ సెన్స్ గురించి

ఈ ఘటనలో తన అసలు ఆందోళన యుఎన్ఒ ఆట గురించి కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు కలిసి ప్రయాణించే ప్రదేశాల్లో కనీస పౌరస్పృహ, ఇతరుల ప్రశాంతతను గౌరవించే బాధ్యత ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. మనలో ఎవరూ వారిని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. కోచ్‌లోని మిగిలిన 16 మంది ఈ పరిస్థితిని భరించాల్సిందే అన్నట్టుగా ఉందని ఆమె బాధను వ్యక్తం చేశారు.

భారతీయులుగా మనమే ఓడిపోయాం

ఆ బృందం అనంతరం బాలీవుడ్ పాటలను కూడా ఉద్దేశపూర్వకంగా ప్లే చేయడం ప్రారంభించారని, ఇది ఎవరు గెలిచారు అనే విషయం కాదు అని, వారితో పాటు తానూ భారతీయురాలిగానే ఈ సివిక్ సెన్స్ గేమ్‌లో ఓడిపోయానని ఆమె వ్యాఖ్యానించారు. చివరగా మన దేశంలో ప్రజల పబ్లిక్ బిహేవియర్ ఎప్పుడు మెరుగుపడుతుందని ప్రశ్నించిడంతో పాటు దేవుడే ఈ దేశాన్ని రక్షించాలని పోస్టును ముగించారు. శివశ్రీ పోస్టుకు సోషల్ మీడియాలో భారీగా స్పందన వచ్చింది. ఈ పోస్టుకు 1.08 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై రైల్వే అధికారుల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందనరాలేదు.


Next Story