వాగులో కొట్టుకుపోయిన భార్యాభర్తల మృతదేహాలు లభ్యం

మొంథా తుఫాన్ యువ దంపతులను మింగేసిన విషాదకర ఘటన మెదక్ జిల్లా, అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని మోత్కులపల్లి వాగులో భీమదేవరపల్లి మండలానికి చెందిన దంపతులు ఈసంపల్లి ప్రణయ్ (28), కల్పన (24) గురువారం గల్లంతయ్యారు. వాగు ప్రవాహంలో మల్లంపల్లి గ్రామానికి చెందిన గొర్ల సమ్మయ్య పశువుల షెడ్డు వద్ద బైకు లభ్యమైంది. రెస్క్యూ టీంతో గురువారం రోజంతా పకడ్బందీగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహాల ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించడంతో భార్యాభర్తల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసిన కుటుంబీకులు, బంధువులు ఆర్తనాదాలు మల్లంపల్లి చెరువు పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
-
Home
-
Menu
