విషాదం మిగిల్చిన పెళ్లి వేడుకలు

పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తున్న ఓ కుటుంబంలో ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి అతివేగంగా వచ్చిన డిసిఎం వాహనం బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా, వెంకటాపురం గ్రామానికి చెందిన రెడ్డబోయిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సుధన్‌పల్లికి చెందిన నాగల, సిద్దిపేట జిల్లా, వెంకటాపురంనకు చెందిన భాస్కర్ వివాహ నిమిత్తం సుధన్‌పల్లి వెళ్లారు. పెళ్లి పూర్తయ్యాక, మరుసటిరోజు మారుపెళ్లి కోసం వెంకటాపురం వచ్చి,
అక్కడ నుండి రాత్రి 8 గంటలకు మళ్లీ సుధన్‌పల్లికి బొలెరో వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామ శివారులో మూత్రవిసర్జన కోసం వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. సరిగ్గా అదే సమయంలో, ఎల్కతుర్తి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన డిసిఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రెడ్డబైన స్వప్న (16), శ్రీనాథ్ (6), కలమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. అనసూయ, అక్షయ, మారుతి, రమాదేవి, దేవేందర్, నవలోక్, రిత్విక్, సరోజన, కార్తిక్, శ్రీరామ్ సహా మొత్తం 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రి, రాజు గార్డెన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బాధితులకు అండగా నిలిచిన డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్
రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ నియోజకవర్గం, కురవి మండలానికి చెందిన మృతులతోపాటు బాధితుల ఎక్కువగా ఉండడంతో ఎంఎల్‌ఎ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ బాధితులకు అండగా నిలిచారు. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాలతోపాటు ఎంజిఎంతోపాటు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి బంధువులను ఆయన ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు.
ఎంజిఎం ప్రధాన రహదారిపై రాస్తారోకో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
ఇదిలాఉంటే బాధితులను పోలీస్ శాఖ పట్టించుకోవడంలేదని ఆక్రోశంతో గ్రామస్థులంతా ఎంజిఎం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని డిమాండ్ చేశారు. అదే సందర్భంలో డాక్టర్ రామచంద్రనాయక్ బాధితులతో మాట్లాడినప్పటికీ వారు ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని అర్థం చేసుకొని బాధితులకు తగిన న్యాయం చేస్తామని డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్‌తో కలిసి ఎంజిఎంలోని బాధితుల వద్దకు వెళ్లారు. దీంతో రాస్తారోకోను విరమించారు.
-
Home
-
Menu
