పెళ్లైన మరుసటి రోజే ప్రసవం....

పెళ్లైన మరుసటి రోజే ప్రసవం....
X

మన తెలంగాణ – క్రైమ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లా పాళయంకోట్టైలో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మరుసటి రోజే వధువు బిడ్డకు జన్మనివ్వడం, మరోవైపు వరుడి ఇంటి వద్ద శిశువు మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పెళ్లికి ముందే వధువు గర్భవతి అనే విషయాన్ని తనకు తెలియకుండా దాచిపెట్టారని వరుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. పాళయంకోట్టై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి, మరో గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 1న వివాహం జరిగింది. పెళ్లి అనంతరం అదే రోజు రాత్రి వధువు భర్త ఇంటికి వెళ్లింది. అయితే మరుసటి రోజు ఉదయం ఆమెకు తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. మరోవైపు వరుడి ఇంటి వద్ద శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో వధువును పోలీసులు విచారించారు. పెళ్లికి ముందే ఆమె గర్భవతిగా ఉన్నట్లు తెలిసిందని, ఈ విషయాన్ని తనకు తెలియకుండా దాచి వివాహం జరిపించారని వరుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story