డివైడర్ ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమీపంలోని కిష్టారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఐదుగురు యువకులు కలిసి కారులో వెళుతుండగా కిష్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామం, మహబాద్‌నగర్‌కు చెందిన ఎన్‌డి షాజీత్ (21), సత్తుపల్లి మండలం, కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సిద్దేసి జాయ్ (21), మర్సకట్ల శశివర్ధన్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన తలారి అజయ్, మహబాద్‌నగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేయగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ఉన్నవారి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లూరు వసుంధర యాదవ్, సత్తుపల్లి సిఐ తుమ్మల శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
