శ్రీశైలం యాత్రలో విషాదం

దైవ దర్శనానికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం, విజయపురి (బీజాపూర్) జిల్లా, తాళికోట ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది భక్తులు రెండు క్రూజర్ వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరారు. జడ్చర్ల-కోదాడ 167 జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో ఒక క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ముందు సీట్లలో కూర్చున్న వారు వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో రాంరెడ్డి (52), ఆయన భార్య మేఘనరెడ్డి (45), మహాదేవి (55) అక్కడికక్కడే మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రమాదంలో కన్నుమూయడం స్థానికులను కలచివేసింది. మరో రెండు గంటల్లో క్షేత్రానికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరగడం వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయని తెలిపారు.
రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. సిఐ నాగార్జున, ఎస్సై కృష్ణదేవ తమ సిబ్బందితో అక్కడ ఉన్న లారీ డ్రైవర్, జెసిబి సహాయంతో వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్నం హాస్పిటల్‌కు, స్వల్ప గాయాలైన మిగిలిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అలసట కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
-
Home
-
Menu
