కార్ల రేసింగ్‌.. నిండు ప్రాణం బలి!

కార్ల రేసింగ్‌.. నిండు ప్రాణం బలి!
X

అమిస్తాపూర్‌లో దంపతులపై దూసుకెళ్లిన కారు.. భార్య మృతి

భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు

మన తెలంగాణ/ భూత్పూర్: మెడికల్‌ కాలేజీ విద్యార్థుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సహన బేగం (40) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త సాహిర్‌, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. అమిస్తాపూర్‌కు చెందిన సాహిర్‌ టైలర్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి సాహిర్‌ తన భార్య సహన బేగం, కుమార్తెతో కలిసి పనిమీద వెళ్తుండగా, మెడికల్‌ కాలేజీ విద్యార్థులు పోటాపోటీగా కార్లు నడుపుతున్న క్రమంలో ఓ కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సహన బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సాహిర్‌, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అమిస్తాపూర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణాలు, కార్ల రేసింగ్‌ జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా, పోటాపోటీగా వాహనాలు నడపడం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags

Next Story