బస్సును ఢీకొట్టిన కారు... ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

బస్సును ఢీకొట్టిన కారు... ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
X

తిరుచి: తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పెరంబలూర్ జిల్లా తురైమంగళం సమీపంలో తిరుచి-చెన్నై జాతీయ రహదారి(NH-38)పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి.. ప్రైవేట్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. ఇద్దరు మహిళలతో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రామనాథపురం జిల్లా ముదుకులత్తూరులోని ఒరివయల్ గ్రామానికి చెందిన కార్తీ(38).. చెన్నై నుంచి భార్య, అదే గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లారు. వివాహం ముగిసిన తర్వాత, కార్తీ, అతని భార్య, స్నేహితులు కారులో చెన్నైకి తిరిగి వస్తుండగా, NH-38పై తురైమంగళం సమీపంలో ముందు వెళ్తున్న బస్సు వెనుక భాగాన్ని వారి కారు వేగంగా ఢీకొట్టింది.

సమామాచారం అందుకున్న పెరంబలూర్ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని పెరంబలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న కాజా అలియాస్ కలిశ్వరన్, ప్రభాకరన్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన కార్తీ, పెరంబలూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కార్తీ భార్య సూర్య, కారు డ్రైవర్ కన్నదాసన్, జాన్ కెన్నెడీ, శరణ్యలను పెరంబలూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన సూర్యను మెరుగైన చికిత్స కోసం తిరుచిరాపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పెరంబలూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా బస్సు డ్రైవర్ అయిన తూత్తుకుడికి చెందిన రాజశీలన్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Tags

Next Story