గ్యాస్‌కట్టర్లతో కట్‌చేసి.. రెండు ఎటిఎంలలో నగదు చోరీ

గ్యాస్‌కట్టర్లతో కట్‌చేసి.. రెండు ఎటిఎంలలో నగదు చోరీ
X

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లోని ఎస్‌బిఐ ఎటిఎంలలో చోరీలు జరిగాయి. దుర్శేడ్ ఎటిఎంలోకి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ఎటిఎంలోకి ప్రవేశించగానే వారు సిసి కెమెరాలపై ఒక రకమైన ద్రవాన్ని చల్లి.. తర్వాత గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఎటిఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఎటిఎంలో ఎంత నగదు పోయిందనే వివరాలు తెలియరాలేదు. నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లవ్స్ ధరించారు.

దుర్శేడ్ ఎటిఎం చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బిఐ ఢిల్లీ కార్యాలయంలో అలారం మోగింది. వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనలపై పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతోపాటు సిసిటివి ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సిసిటివి ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

Tags

Next Story