అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరు: చంద్రబాబు

అమరావతి: రాజ్యసభలో మన రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందబోతున్నదని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతికి మనకు సెంటిమెంట్ అని అన్నారు. సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలని అధికారులకు ఆదేశించారు. నేడు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో.. నీరు- మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతాన్ని పర్యటించి.. రాజధానిలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్ డిఎ నేతలతో సిఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఐదేళ్ల పాటు ఎపికి రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారని గత ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించారు. అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్టని, అమరావతి పేరు పలకడానికే మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఇష్టపడరని, అందుకే మావిగన్ అనే వింత పేరును తీసుకొచ్చారని మండిపడ్డారు.
గతంలోనూ ఎస్ఆర్ఎం అమరావతి అని ఉంటే.. ఎస్ఆర్ఎంగా మార్పించారని, అమరావతి పేరు వింటేనే జగన్ కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్ లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందని, గత ఐదేళ్లు మీకు 3 రాజధానులా అని చాలామంది ఎగతాళిగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పేరోజు వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని, అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డిఎ ప్రభుత్వం ముందుకెళ్తుందని కొనియాడారు. మా రాజధాని అమరావతి అని ప్రతిఒక్కరిలో భావన రావాలని సూచించారు. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, మద్దతు తెలిపిన వారికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
-
Home
-
Menu
