గుంపుల చెక్ డ్యాం కూల్చివేత

గుంపుల చెక్ డ్యాం కూల్చివేత
X

పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, గుంపుల శ్రీకల్కి రామభ్రద దేవాలయం కింద ఉన్న చెక్ డ్యాంను కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. మొన్నటి మొంథా తుఫానుతో వచ్చిన భారీ వరద నుండి కూడా తట్టుకొని నిలబడిన చెక్‌డ్యాం ఇలా వరదలు లేని సమయంలో రాత్రికిరాత్రి కూలిపోవడం వెనుక కచ్చితంగా ఇసుక మాఫియా ప్రమేయం ఉందని స్థానికులు అభిప్రా యపడుతున్నారు. నిండుకుండలా ఉండడంతో ఇసుక తీయడానికి వీలుకాక డ్యాంను దుండగులు పేల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరో కాశీగా అభివృద్ధి చెందుతున్న దేవాలయం అభివృద్ధికి ఈ ఘటన ఇబ్బందికరంగా మారనుంది. భక్తులు స్నానాలు చేయడానికి, రానున్న ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుంపుల మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.


కూలిపోయిన చెక్‌డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

కూలిపోయిన చెక్‌డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తమ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచాలనే ఆలోచనతోనే మానేరు నదిపై దాదాపు 23 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఇక్కడ గుంపుల, శంబునిపల్లె గ్రామాల మధ్యలో చెక్‌డ్యాం నిర్మాణం చేయడం మూలంగా చుట్టుపక్కల గ్రామాల అందరికీ సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకుంటున్నారని అన్నారు. కానీ ఇక్కడ చెక్‌డ్యాంను కొంతమంది దురుద్దేశంతో పేల్చివేసినట్టుగా కనబడుతోందని,

ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనిచేసినట్టుగా కనబడుతోందని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చెక్‌డ్యాంను వెంటనే తిరిగి పునర్‌నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, మాజీ సర్పంచ్ సంపత్, సదారెడ్డి, గోవిందుల ఎల్లస్వామి, చర్లపల్లి సురేష్‌గౌడ్, ఉప్పుల శ్రీనివాస్, పర్శ రాములు, మర్రిపల్లి కుమార్, బుచ్చయ్య, లింగయ్య, గంధం శ్రీనివాస్, గణేష్, శివ, వెంకన్న, అశోక్, అజయ్, ఇట్యాల శ్రీనివాస్, సంపత్ తదితరులు ఉన్నారు.

Tags

Next Story