పంట పొలాల్లో నాటుకోళ్లు..ఎగబడిన జనం

పంట పొలాల్లో నాటుకోళ్లు..ఎగబడిన జనం
X

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పంట పొలాల్లో వేలాది నాటుకోళ్లు కలకలం సృష్టించాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా విన్న జనం నాటుకోళ్లను దక్కించుకునేందుకు పరుగులు తీశారు. వేలాది నాటుకోళ్లు పంటపొలాల్లో ఒక్కసారిగా దర్శనం ఇవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తే వివరాలు ఇలా వున్నాయి. వైరస్ వచ్చిందననే అనుమానంతో డిసిఎం వ్యాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ శివారు ప్రాంతంలోని చేను చెలకల్లో నాటుకోళ్లను కుమ్మరించిపోయారు. పంట చేనుల్లోకి నాటుకోళ్లు వేలాదిగా ఒక్కసారిగా రావడం ఏమిటని ఆలోచించకుండానే నాటుకోళ్ళను ఎవరికి అందిన మేరకు వారు దక్కించుకున్నారు.

అయితే, పంటపొలాల్లో విడిచిపెట్టిన నాటుకోళ్లకు వైరస్ ఉంటుందనే అనుమానంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అ కోళ్లకు వైరస్ ఉందని, వాటిని తింటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న అనుమానంతో పోలీసులు పశు వైద్య అధికారులను రంగoలోకి దించారు. అక్కడున్న కొన్ని కోళ్లను పరీక్షించిన వెటర్నరీ వైద్యాధికారి దీపిక నాటుకోళ్లకు ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించారు. పశువైద్యాధికారుల నిర్ధారణతో ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు తమ వెంట తీసుకెళ్లిన నాటుకోళ్లను వండుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, వేలాది నాటుకోళ్లను ఈ గ్రామానికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Tags

Next Story