చెడగొట్టేవాళ్లను గుర్తుంచుకుంటాం

కష్టపడిన వారిని గుర్తిస్తాం
రెండో సారి అధికారంలోకి వస్తాం..
కోటి ఓట్లతో 90 సీట్లు గెలుస్తాం..
టిపిసిసి విసృ్తత స్థాయి సమావేశం లో సీఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారిని గుర్తిస్తాం. పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తించే వారినీ గుర్తించి, గుర్తుంచుకుంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చెడు ఉంటే చెవిలో, మంచి పనులు ఉంటే మైక్‌లో చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ విసృ్తత స్థాయి సమావేశంలో పార్టీ నూతన ఇన్చార్జి సందీప్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులకు కెసీఆర్ బలవంతంగా, అక్రమ కేసుల ద్వారా బీఆర్ఎస్ కండువాలు కప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని, మళ్లీ పెరగనివ్వబోనని కెసీఆర్ విర్రవీగారని విమర్శించారు. తాను డిజిటల్ మెంబర్షిప్ చేపట్టి 90 రోజుల్లో 48 లక్షల సభ్యత్వం చేయించానని తెలిపారు. కెసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినప్పుడు కార్యకర్తలు విజయమో, వీర మరణమో అన్నట్లుగా సభ్యత్వం చేయించారని గుర్తు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 92,35,833 ఓట్లు, 64 సీట్లు సాధించగా, సీపీఐ ఒక సీటు గెలిచిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన అనేక మందికి టికెట్లు ఇచ్చామని, బడుగు, బలహీన వర్గాల నాయకుల ఇళ్లకు బీ ఫామ్ పంపామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన 70 శాతం మందికి టికెట్లు ఇచ్చామని తెలిపారు. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కష్టకాలంలో పార్టీ జెండా మోశారని, అందుకే వారికి టికెట్లు ఇచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు చేశామని వివరించారు.
మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారని, తర్వాత ఎమ్మెల్సీ, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యారని అన్నారు. టికెట్ రాని పలువురికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని, రాహుల్ గాంధీపై విశ్వాసంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి రెవెన్యూ మంత్రి అయ్యారని తెలిపారు. నారాయణఖేడ్ టికెట్‌ను సంజీవరెడ్డి కోసం వదులుకున్న సురేష్ షెట్కర్‌ను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిని చేసిందన్నారు.
రాజకీయాల్లో అన్నాచెల్లెళ్లు కూడా కొట్టుకుంటున్నారని, ఎన్డీయేకు 240 సీట్లు దాటవని తాను గతంలో చెప్పింది నిజమైందన్నారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేయాలని, రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహం రూపొందిస్తున్నామని చెప్పారు. నాయకుల ప్రవర్తన, మాటతీరును గమనిస్తున్నామని, ముందు, వెనుక వారు మాట్లాడే విషయాలపై పార్టీకి పూర్తి సమాచారం ఉందన్నారు. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకోసారి వస్తుందని, ఎన్నికల సమయంలో శ్రమను కొలుస్తామని, పార్టీ లైన్లో ఉంటే పదవి ఇంటికి దానంతట అదే వస్తుందని తెలిపారు.
అనుబంధ విభాగాల్లో పనిచేసిన 65 మందికి పదవులు ఇచ్చామని, గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ తిరిగితే పదవులు వస్తాయనుకోవడం అపోహేనన్నారు. హుజూరాబాద్‌లో 3,700 ఓట్లతో మొదలై 64 సీట్ల వరకు పార్టీ ఎదగడానికి కార్యకర్తల కృషే కారణమన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉపకులాల మధ్య సఖ్యత తెచ్చామని, 95 ఏళ్ల తర్వాత తెలంగాణలో కులగణన చేశామని చెప్పారు. అన్ని చట్టాలు, న్యాయస్థానాల ముందు నిలబడేలా కులగణన నిర్వహించామన్నారు.
బీఆర్ఎస్ గతమే కానీ భవిష్యత్తు లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని, కృష్ణా, గోదావరి నీళ్లపై కూడా అబద్ధాలు చెబుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు వస్తానని, నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతానని చెప్పానన్నారు. గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా వేసి కెసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపామని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు బట్టలు విప్పుకున్నారని, మొన్న అంగీనే విప్పించా.. ఈసారి లాగు కూడా విప్పిస్తా అని అన్నారని తెలిపారు.
సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తామని, కరువును ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 3,700 నుంచి 92 లక్షల ఓట్లు తెచ్చిన కార్యకర్తలు తమ వద్ద ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 సీట్లు గెలుస్తామని అన్నారు. కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా, 52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, 3.42 కోట్ల మందికి ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సన్నబియ్యం తింటున్నారని, వారి ఆడపడుచులు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని, వారి ఇళ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని, వాటిని ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. మంచి మైక్‌లో, చెడు చెవిలో చెప్పాలని, తాను కార్యకర్తల నాయకుడినని అన్నారు. పిల్లి గుడ్డిది అయితే ఎలుక డిస్కో డాన్స్ చేస్తది అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో చేసిన పాపాలు కడుక్కోవడానికి కెసీఆర్ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని విమర్శించారు.
-
Home
-
Menu
