రైజింగ్ అన్‌స్టాపబుల్

మనతెలంగాణ/హైదరాబాద్: చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులు, ఉత్పత్తితో చైనాను లీడ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగానే తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్లనున్నట్లు సిఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ‘తెలంగాణ రైజింగ్- 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని ఆయ న తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తున్నామని వివరించా రు. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంట్‌ను రెడీ చేశామని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలపాలన్న లక్ష్యాలను నిర్ధేశించామని తెలిపారు. ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను కోరామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
వారి అంచనాలు, ఆలోచనలు, కలలను తమతో పంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం, అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీసుకున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ దార్శనికతను రూపొందించడంలో సహాయ పడిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రకంగా నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపు ణులు ఇందులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ సమ్మిట్‌లో మీరందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 2047కు ఓ ప్రత్యేకత ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047కు ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుందని ఆయన తెలిపారు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలోచనలు చేశారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించా రన్నారు.
దేశ భవిష్యత్‌గా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి తాము ప్రేరణ పొందామన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, 2014లో సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించింది. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. దేశంలోనే తెలంగాణ యువ రాష్ట్రమని ఆయన తెలిపారు.
-
Home
-
Menu
