సామాజిక న్యాయమే 'విజన్ ' లక్ష్యం

సామాజిక న్యాయమే విజన్  లక్ష్యం
X

మనతెలంగాణ/హైదరాబాద్: పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని, కొందరికి పేదరికం ఎక్స్‌కర్షన్ లాంటిదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ, తనకు పేదరికం అంటే ఏమిటో తెలుసనీ, తాను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకొని వచ్చానని, తనకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన అని ఆయన తెలిపారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందని, జల్, జంగిల్, జమీన్ అని కొమురంభీమ్ పోరాడిన గడ్డ ఇది అని, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. వాటిని అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామని ఆయన తెలిపారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు (రెండోరోజూ) కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామన్నారు. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదని, నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకొని తయారు చేసిందని ఆయన తెలిపారు.విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందని, అందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు.

ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్షంతో ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా లక్ష్యాలను నిర్ధేశించుకుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్‌ఇండియా స్కిల్ యూనివర్శిటీని నిర్మిస్తున్నామని, 140 కోట్ల జనాభా ఉన్న దేశం గత ఒలింపిక్స్‌తో ఒక్క సర్ణపతకం గెలవలేకపోయిందని, అందుకే క్రీడాలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్ యూనివర్శిటీని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ స్పీచ్ అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2025ను సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను రోబో సిఎం వద్దకు తీసుకురావడంతో అతిథులు ఆశ్చర్యపోయారు. రోబో చేతుల మీదుగా ఆ డాక్యుమెంట్‌ను అందుకున్న సిఎం దానిని ఆవిష్కరించారు.


విస్తృత సంప్రదింపుల తర్వాతే ‘విజన్’:

ఉప ముఖ్యమంత్రి భట్టి

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించిందని కాదన్నారు. విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాల తర్వాతే రూపకల్పన జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచీ అని ఆయన చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిదన్నారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమన్నారు.

తెలంగాణ విజన్ మార్గదర్శకంగా ఉంది:

ఆనంద్ మహీంద్రా

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశ భవిష్యత్ అని, తెలంగాణ విజన్ చాలా మార్గదర్శకంగా ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రత్యేక మార్గంలో దూసుకెళ్తోందన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారని కితాబిచ్చారు.

ప్రభుత్వం తరపున ఇండస్ట్రీ పూర్తి మద్దతు:మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఇక్కడ ఉన్నారని, వారితో కలిసి వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇది కేవలం చిరంజీవికి వచ్చిన ఆహ్వానం మాత్రమే కాదనీ, మొత్తం సినీ ఇండస్ట్రీకి దక్కిన గౌరవమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కలలుగన్నట్లుగా హైదరాబాద్‌ను ప్రపంచానికి సినీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతామన్నారు.

Tags

Next Story