బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ.. హుస్నాబాద్: సిఎం రేవంత్

కరీంనగర్: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని.. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. 60 ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చానని సిఎం చెప్పారు. సోనియమ్మతోపాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించి వచ్చానన్నారు.
"డిసెంబర్ 3 కు ఒక ప్రత్యేకత ఉంది. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది. తెలంగాణ కోసం శ్రీకాంత చారి అమరుడైన రోజు ఇది. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునే లోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశాం. రూ. 8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశాం. లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించాం. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్ కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు కానీ హుస్నాబాద్ ను అభివృద్ధి చేయలేదు. గత పాలకుల్లా మేం హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తాం. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లని ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి" అని సిఎం పిలుపునిచ్చారు.
-
Home
-
Menu
