నేడు మన్మోహన్‌సింగ్ విగ్రహావిష్కరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా గచ్చిబౌలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో విప్రో సర్కిల్ వద్ద ఆవిష్కరించనున్న నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో
డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైనదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2009లో ప్రక్రియ ప్రారంభించేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన పరిణామాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ సేవలకు తగిన గౌరవం అందిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. శనివారం డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సిఎం రేవంత్‌తోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
-
Home
-
Menu
