‘స్టాలిన్ సార్.. నోరు విప్పండి’: సిఎం విజయ్

తమిళనాడులో అధికార డీఎంకే, ఏఐఏడీఎంకేలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. అక్టోబరు 6న జరగనున్న మదురాంతకం అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన డీఎంకేను ‘దుష్ట శక్తి’గా అభివర్ణించారు. రెండు ద్రవిడ పార్టీల మధ్య చాలాకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. అవి కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు బీజేపీతోనూ అవగాహన ఉందని ఆరోపించారు.ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే కె. మరగతం కుమారవేల్ రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో మదురాంతకం ఉపఎన్నిక అనివార్యమైంది. ఆమెనే టీవీకే అభ్యర్థిగా బరిలోకి దించింది.
గ్రానైట్ వ్యాపారి ఆర్. వీరమణికి సంబంధించిన పోక్సో కేసును విజయ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఏళ్లుగా పిల్లల జీవితాలను నాశనం చేస్తున్న వ్యక్తి గురించి గత ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు నమోదైందని, అయితే నేరం, దాని చరిత్ర మొత్తాన్ని మరుగున పడేశారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ను ఉద్దేశించి ‘స్టాలిన్ సార్.. నోరు విప్పండి’ అని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య ఏదైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.
వీరమణికి సంబంధించిన పోక్సో కేసు 2025లో నమోదైంది. మైనర్‌పై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఉన్నట్లు చెబుతున్న పెన్‌డ్రైవ్ పోలీసులకు అందడంతో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు కేసును మూసివేయాలని కోరగా.. ప్రత్యేక పోక్సో కోర్టు ఆ క్లోజర్ రిపోర్టును తిరస్కరించి, దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో వీరమణితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, వీరమణి కేసులో తమ ప్రభుత్వం ఎవరినీ కాపాడేందుకు ప్రయత్నించలేదని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తన ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు అసత్యమైనవి, పరువు నష్టం కలిగించేవి అని ఆయన పేర్కొన్నారు.
-
Home
-
Menu
