తెలంగాణపై చలి పంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలంగాణపై చలి పంజా విసురుతోంది. దీంతో రాష్ట్రమంతా గజ గజా వణుకిపోతోంది. ఈ నెల 16 వరకు రాష్ట్రంలో తీవ్ర చలి వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.
ప్రత్యేకించి డిసెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తెలంగాణతో పాటు కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధి కంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లో పెరగనున్న చలి తీవ్రత
హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా. హైదరాబాద్ వాసులు కూడా చలిగాలుల ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల అదనపు శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. చలి తీవ్రత పెరిగే క్రమంలో ఉదయం వేళల్లో, రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కర మని చెబుతున్నారు. పొగమంచు, చలి కారణంగా వాహనదారులు కూడా రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిం చారు.
-
Home
-
Menu
