రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస..పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదు: హరీష్ రావు

రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మా దెబ్బకే సీఎంకు సోయి వచ్చింది మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపామన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామని, ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఇది బీఆర్‌ఎస్ విజయమే కాదు, రైతుల విజయం అన్నారు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదని, మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారన్నారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదన్నారు. భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని, రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచిందన్నారు. 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?.. దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వు. బీఆర్‌ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోంది. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది. కేసీఆర్ గారు ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది.
కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ.. కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలి. ఇంత వరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? పేపర్లలో చూస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలి. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా? ఎంజీఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా విలేకరులే విసిగిపోయారు.
రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా? రెండున్నరేళ్లలో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారింది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదు. ఎక్స్‌రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆసుపత్రిలో మందులు లేవు. ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి.పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సమానంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుందని, కేసీఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేశారు.
-
Home
-
Menu
