జాతరకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతర కి బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని ఇందారం ఖాసీం పల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సంగమల్లయ్యపల్లి గ్రామం, చెందిన బేతోజు నారాయణ (73), ఆయన భార్య బేతోజు భారతమ్మ (55) ఇద్దరూ తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై జైపూర్ మండలంలోని వేలాల జాతరకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇందారం గ్రామ పరిధిలోని కాసింపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టిందని లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. అతివేగంగా ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంఘటన స్థలంలోనే వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుమారుడు బేతోజు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. జాతర ఉత్సాహం మధ్య చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
Home
-
Menu
