వాగులో దంపతులు గల్లంతు

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో దంపతులు గల్లంతైన ఘటన అక్కన్నపేట మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలానికి చెందిన ఈసంపల్లి ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు భీమదేవరపల్లి నుండి ప్రణయ్ అత్తగారింటికి అక్కన్నపేటకు బయలుదేరి ప్రయాణిస్తుండగా ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షానికి కొత్తకొండ వద్ద రాకపోకలకు అంతరాయం కలిగి మోత్కులపల్లి మీదగా అక్కన్నపేటకు వెళ్లే క్రమంలో వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో ద్విచక్ర వాహనంతో సహా దంపతులు వాగులో గల్లంతైనట్లు తెలుస్తోంది.
వాగు ప్రవాహంలో మల్లంపల్లి చెరువులో కొట్టుకొచ్చి గొర్ల సమ్మయ్య పశువుల షెడ్డు వద్ద గ్రామస్తులకు కనబడినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హుటాహుటిగా చేరిన ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్క్యూ టీంను పంపించి గాలింపు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేరుకొని పరిశీలించారు. రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక బృందాలకు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు.
-
Home
-
Menu
