సీతాఫలంపై ప్రకృతి శీతకన్ను

సీతాఫలంపై ప్రకృతి శీతకన్ను
X

ఎల్‌నీనో ప్రభావంతో పూత, పిందె

దశలోనే తీవ్ర నష్టం.. భారీగా తగ్గిన దిగుబడి

సీతాఫలాల కోసం అడవిబాట పట్టినా.. ఖాళీ చేతులతో తిరిగి వస్తున్న పేదలు

మార్కెట్‌లో ఆకాశన్నంటుతున్న ధరలు

టెండర్ దారులకు భారీ నష్టం

బి.జి.రామాంజనేయులు/మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: పేదల ఆపిల్‌గా పేరున్న సీతాఫలం ఈసారి పేదలకే దూరమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీతాఫలాల సీజన్ ప్రారంభమైనా గతంలో మాదిరిగా సందడి లేదు. సకాలంలో వర్షాలు లేకపోవడం, తీవ్ర ఎండల కారణంగా సీతాఫలాల చెట్లకు పూత, పిందె దశలోనే తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి భారీగా పడిపోయింది. అడవుల్లో సీతాఫలాలను సేకరించి జీవించే వేలాది మంది కూలీలు, గిరిజనులు, మహిళలు, నిరుద్యోగుల ఉపాధికి గండిపడింది. సరకు కొరతతో మార్కెట్‌లో సీతాఫలాల ధరలు అమాంతం పెరిగాయి.

వర్షాభావంతో రాలిన పూత

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని గుట్టలు, అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరిగే సీతాఫలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా ఆగస్టు నుంచి నవంబర్ వరకు సీతాఫలాల సేకరణ జోరుగా సాగుతుంది. వ్యవసాయ పనులు లేనప్పుడు అనేక కుటుంబాలకు ఇదే ప్రధాన ఉపాధి. ఈసారి సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చెట్లు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. పూత దశలోనే ఎండ తీవ్రతల వల్ల పూత వాడిపోయి రాలిపోయింది. పిందెలు కూడా ఎదగకముందే రాలిపోయాయి చెట్లకు మిగిలిన కాయలు కూడా చిన్నగా ఉండటం, కొన్ని నల్లబడటం, మరికొన్ని వాడిపోవడంతో దిగుబడి తీవ్రంగా పడిపోయింది.

అడవికి వెళ్లినా.. ఖాళీ చేతులే

వ్యవసాయ పనులు లేని కూలీలు, గిరిజన మహిళలు, యువత ఉదయాన్నే సీతాఫలాల కోసం అడవిబాట పడుతారు. బుట్టలకొద్దీ పండ్లు సేకరించి హైవేల వెంట, పట్టణాల్లో విక్రయిస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు సంపాదించేవారు. ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెట్లపై కాయలు లేకపోవడంతో గంటల తరబడి అడవుల్లో తిరిగినా ఆశించిన మొత్తంలో సీతాఫలాలు దొరకడం లేదు. దీంతో పలువురు కూలీలు ఖాళీ చేతులతోనే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ప్రయాణ, పెట్రోల్ ఖర్చులు కూడా రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యుడికి అందని ధర

దిగుబడి తగ్గడంతో సీతాఫలాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఒక్క సీతాఫలం రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతోంది. బుట్ట ధర రూ.400 నుంచి రూ.600 వరకు చేరింది. వినియోగదారులు ధర చూసి వెనుకడుగు వేస్తున్నారు.

ఏటా దసరా, దీపావళి సమయంలో మార్కెట్లు సీతాఫలాలతో కళకళలాడేవి. ఈసారి సరకు కొరత వల్ల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ధరలు పెరిగినా విక్రయించేందుకు సరిపడా సరకు లేకపోవడంతో వ్యాపారులు, సేకరణదారులు ఇబ్బందులు పడుతున్నారు.

టెండర్‌దారులకు పెట్టుబడి మిగిలేనా?

సీతాఫలాల సేకరణ టెండర్లు దక్కించుకున్న వారికి ఈసారి ప్రకృతి ప్రతికూల పరిస్థితులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. నవాబుపేట మండలంలో గత ఏడాది రూ.4.10 లక్షలకు టెండర్ దక్కగా.. ఈసారి రూ.6.74 లక్షలకు దక్కినట్లు టెండర్‌దారుడు మహమ్మద్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో గత ఏడాది రూ.8 లక్షలుగా ఉన్న టెండర్ ఈసారి రూ.17 లక్షలకు చేరినట్లు తెలిసింది. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని టెండర్‌దారులు వాపోయారు. ఈ ఏడాది సాధారణ దిగుబడిలో 10 శాతం కూడా రాలేదని చెప్పారు. ముందస్తుగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు.

సీతాఫలాల సీజన్.. వేల కుటుంబాలకు జీవనాధారం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక పేద కుటుంబాలకు సీతాఫలాల సీజన్ ఉపాధి. వ్యవసాయ పనులు లేని సమయంలో అడవులకు వెళ్లి సీతాఫలాలను సేకరించి విక్రయించడం ద్వారా కుటుంబ ఖర్చులను నెట్టుకొచ్చే వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఈసారి ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటతోపాటు దానిపై ఆధారపడిన ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతింది.

Tags

Next Story