దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు..

దలైలామా సందేశ సంకలనానికి గ్రామీ అవార్డు
ధ్యానం, దయ, అంతర్ముఖ ఆలోచనల ఆవిష్కరణ
ప్రఖ్యాత సరోద్ వాయిద్యకారుడు అంజద్ సంగీతం
ధర్మశాలలో మిన్నంటిన సంబరాలు, చైనా నిరసనలు
ఈసారి పురస్కారాల్లో మోగని భారతీయ ఖ్యాతి
లాస్ ఏంజిలెస్: ప్రఖ్యాత టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామాకు 90 ఏండ్ల వయస్సులో విశిష్ట గ్రామీ అవార్డు దక్కింది. ఈ వయస్సులో ఈ పురస్కారం రావడం విశేష అంశం అయింది. ఆయన మాటలతో కూడిన ఆల్బమ్ మెడిటేషన్స్ ఆడియోకు గ్రామీ రావడం టిబెట్‌లో ఆయన అభిమానుల నుంచి సంతోషానికి దారితీసింది.టిబెట్ మతగురువు దలైలామా టెంజిన్ గ్యాస్టోకు అవార్డు ప్రకటించినట్లు అంతకు ముందు గ్రామీ వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రకటనలపై చైనా నిరసన వ్యక్తం చేసింది. ఇన్ని సంవత్సరాల జీవిత ప్రస్థానంలో తన ఆలోచనలు, ఆధ్యాత్మిక భావాలు, సందేశాలను దలైలామా ఆడియో రూపంలో వెలువరించారు. దీనిని ధ్యానం పేరుతో అందరి ముందుకు తీసుకువచ్చారు. దలైలామాకు ఇది తొలి గోల్డెన్ గ్రామ్‌ఫోన్. ట్రెవర్ నో హోస్ట్‌గా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 68వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అక్కడి క్రిప్టో . కామ్, ఎరినాలో ఆదివారం రాత్రి కనులపండువగా జరిగింది. 90 కేటగిరిల్లో విజేతలకు అవార్డుల బహుకరణ కార్యక్రమం చేపట్టారు. దలైలామా మాటలకు ప్రఖ్యాత సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ నేపథ్య సంగీతం అందించారు. ధ్యానం, అంతర్ముఖం, దయ , ఆత్మ పరిశీలన వంటి విషయాలను దలైలామ ప్రస్తావించారు. దలైలామాకు గ్రామీ అవార్డు రావడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో ఆయన అనుచరులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. గ్రామీ రావడంపై దలైలామా హర్షం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గొప్పదనం కాదని వ్యాఖ్యానించారు. తాను ఈ అవార్డును సవినయంగా స్వీకరిస్తున్నానని పర్యావరణ హితానికి సందేశంగా దీనిని భావిస్తున్నానని తెలిపారు. విశ్వజనీన సార్వత్రిక భావనకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నానని ప్రకటన వెలువరించారు. దలైలామా తరఫున సింగర్ రుఫూస్ వాయిన్‌రైట్ ఆడియో కేటగిరిలో ఈ అవార్డును స్వీకరించారు. ఇతర కేటగిరిల్లో కూడా గ్రామీ అవార్డులు ప్రకటించారు. స్పెల్‌బెర్గ్ మ్యూజిక్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్నారు. గ్రామీకి భారతదేశ తరఫులన పలు కేటగిరిల్లో పోటీకి ఎంపిక అయిన ఆల్బమ్‌లు చివరికి పురస్కారం పొందలేకపొయ్యాయి.
-
Home
-
Menu
