అసలు మీరు తెలంగాణకు తెచ్చింది ఏంటీ? : కెటిఆర్

అసలు మీరు తెలంగాణకు తెచ్చింది ఏంటీ?  : కెటిఆర్
X

హైదరాబాద్: అన్ని గ్రామాలు, పట్టణాల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదిలాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆదివారం మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..7 వేలకు పైగా గ్రామాల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, ఆదివారం నందినగర్ లో 900 మంది పోలీసులను పెట్టారని.. పోలీసులంతా ఒకేచోట ఉంటే నగరంలో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతున్నాయని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎపి, కేంద్రంతో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోగలం అని కెటిఆర్ తెలియజేశారు. నల్లమల సాగర్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, రాష్ట్రంలో సహజ వనరులు, జలవనరుల దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. సింగరేణిలో స్కామ్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం లేదని, కేంద్రం అప్పు 3 రెట్లు పెరిగి.. నెలకు రూ. లక్ష కోట్లు వడ్డీలకే పోతోందని ఎద్దేవా చేశారు. పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని, ఎరువుల రాయితీ, ఆహార రాయితీకి నిధులు తగ్గించారని ధ్వజమెత్తారు.

60 సార్లు ఢిల్లీకి వెళ్లి సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేమిటీ? అని..అసలు మీరు తెలంగాణకు తెచ్చింది ఏంటీ? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ హయాంలోని డేటా సెంటర్స్ కు సబ్సిడి, గర్ల్స్ హాస్టల్స్ ని పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, బయో ఫార్మాకు కేంద్రం రూ. 10 వేల కోట్లు ప్రకటించిందని అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. తీర్పు ఇవ్వడానికి సిపి సజ్జనార్ జడ్జికాదు..పోలీస్ అధికారి మాత్రమేనని, కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు పోలీస్ అధికారులు ఆడొద్దు అని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ లో చార్జ్ షీట్ వేయండని, మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డే అని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు, ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు అని కెటిఆర్ పేర్కొన్నారు.

Tags

Next Story