2027లో దేశీయ డెంగ్యూ టీకా!

2027లో దేశీయ డెంగ్యూ టీకా!
X

నాలుగు రకాల వైరస్‌లపై ఒకే టీకాతో రక్షణకు ప్రయత్నం

మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ‘డెంగీఆల్‌’

విజయవంతమైతే 2027 చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం

మన తెలంగాణ, హైదరాబాద్‌: వర్షాకాలం వస్తే చాలు.. డెంగ్యూ భయం వెంటాడుతోంది. ప్రతి ఏడాది వేలాది మందిని ఆసుపత్రుల పాలుచేస్తున్న ఈ వైరస్‌కు దేశీయంగా తయారవుతున్న టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత తొలి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్‌ ‘డెంగీఆల్‌’ ప్రస్తుతం పెద్దఎత్తున మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. పరీక్షలు విజయవంతమై నియంత్రణ అనుమతులు లభిస్తే 2027 చివరినాటికి టీకా ప్రజలకు అందుబాటులోకి రావచ్చని ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ తెలిపారు.

నాలుగు రకాలపై ఒకేసారి..

డెంగ్యూ వైరస్‌లో ప్రధానంగా డిఇఎన్ వి -1, 2, 3, 4 అనే నాలుగు సెరోటైపులు ఉన్నాయి. ఒక రకంతో ఇన్ఫెక్షన్‌ వచ్చిన తర్వాత మిగిలిన రకాలపై పూర్తిస్థాయి రక్షణ ఏర్పడదు. పైగా తదుపరి ఇన్ఫెక్షన్‌ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన డెంగ్యూ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే నాలుగు రకాల వైరస్‌లపై రక్షణ కల్పించే టీకా అభివృద్ధి కీలకంగా మారింది. డెంగీఆల్‌ను ఐసిఎంఆర్‌, పానేసియా బయోటెక్‌ కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. నాలుగు సెరోటైపులపై రక్షణ కల్పించడమే దీని లక్ష్యం. 2024లో ప్రారంభమైన మూడో దశ పరీక్షల్లో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాలంటీర్లను చేర్చారు. టీకా భద్రత, ప్రభావం, దీర్ఘకాలిక రక్షణ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

అనుమతుల తర్వాతే ప్రజలకు

ప్రస్తుతం టీకా పరీక్షల దశలోనే ఉంది. కాబట్టి ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ అన్న భావన సరికాదు. మూడో దశ ఫలితాలు, నియంత్రణ సంస్థల పరిశీలన, అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ నివారణలో టీకా కీలకమైన ముందడుగు కావచ్చు. అయితే దోమల నియంత్రణ, నిల్వ నీరు లేకుండా చూడటం, వ్యక్తిగత రక్షణ చర్యలు కూడా కొనసాగాల్సిందే.

Tags

Next Story