భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
X

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్దంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాంగ స్నవనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, ఉగాది వేపపూత ప్రసాదం స్వామి వారికి నివేదన చేశారు. అలాగే బ్రహ్మో త్సవాలను పురస్కరించుకుని పాల్గొనే రుత్వికులకు, సిబ్బందికి భద్రాద్రి దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ దీక్ష వస్త్రాలను అందజేశారు. మూలవరులకు అభిషేకం, బేడా మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను

మృత్సంగ్రహణంను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సమయంలో భూ వరాహాస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మట్టిని సేకరించి కల్యాణ అంకురార్పణకు వినియోగించారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో గురువారం నుంచి నిత్యక ల్యాణాలు ఏప్రిల్ రెండు వరకు నిలిపివేశారు. అలాగే నేటి నుంచి రెండు వరకు పవళింపు సేవలు నిలిపివేశారు. ఉగాదిని పురస్కరించుకొని రాత్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉగాది పర్వదినంను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వరుస సెలవుదినాలు కావడంతో రామయ్య దర్శనంకు భక్తులు పోటెత్తారు.

Tags

Next Story