డిజె సౌండ్ తో గుండె ఆగిపోతుందా?

does dj sound causes heart attack
X

does dj sound causes heart attack

"డిజె శబ్దం విన్న వెంటనే గుండెపోటు వస్తుంది” అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. అందరికీ గుణడెపోటు రాదు.. కాకపోతే ఇదివరకే గుండె జబ్బులుంటే కొంత రిస్క్... చదవండి. పండుగలు, ఊరేగింపులు, వివాహాలు అంటే సంగీతం, సంబరాలు సహజమే. కానీ శబ్దానికి కూడా ఒక పరిమితి ఉంది. ముఖ్యంగా భారీ డిజె సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే అత్యధిక శబ్దం కేవలం చెవులకు మాత్రమే కాదు, మన గుండె, రక్తనాళాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

ఇటీవలి కాలంలో డిజె శబ్దం మధ్యలో కొంతమంది అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం, కుప్పకూలడం వంటి వార్తలు కనిపిస్తున్నాయి. ప్రతి ఇలాంటి ఘటనకు డిజె శబ్దమే కారణమని చెప్పలేం. అయితే అధిక శబ్దం శరీరంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావడంతో పాటు ముఖ్యంగా ఇప్పటికే గుండెజబ్బులు ఉన్నవారిలో ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి.

అసలు శరీరంలో ఏం జరుగుతుంది?

మనకు భరించలేనంత పెద్ద శబ్దం వినిపించినప్పుడు శరీరం దానిని ఒక రకమైన ప్రమాద సంకేతంగా గుర్తించవచ్చు. వెంటనే ఫైట్ ప్రతిస్పందన ప్రారంభమవుతుంది.

దీంతో

అడ్రినలిన్ వంటి ఆందోళన కలిగించే హర్మోన్ విడుదల కావచ్చు.

గుండె వేగం పెరగవచ్చు.

రక్తపోటు తాత్కాలికంగా పెరగవచ్చు.

రక్తనాళాలు సంకోచించవచ్చు.

గుండెకు ఆక్సిజన్ అవసరం పెరగవచ్చు.

డబ్యుహెచ్ఒ వివరాల ప్రకారం అధిక శబ్దానికి గురైనప్పుడు రక్తపోటు, హృదయ స్పందన వంటి రక్తప్రసరణ మార్పులు, స్ట్రెస్ హర్మోన్ విడుదల వంటి ప్రతిచర్యలు కనిపించవచ్చు.

ఎవరిలో ప్రమాదం ఎక్కువ?

అందరికీ ఒకే స్థాయిలో ప్రమాదం ఉండదు. ముఖ్యంగా

గుండె ధమనుల్లో బ్లాకేజీలు ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, గతంలో గుండెపోటు వచ్చినవారు, హృదయ స్పందనలో అవకతవకలు ఉన్నవారు, వృద్ధులు వంటి వారికి తీవ్రమైన శబ్దంతో పాటు నిద్రలేమి, భయం, ఉత్సాహం, ఎక్కువసేపు నృత్యం చేయడం వంటి ఇతర శారీరక ఒత్తిళ్లు కలిస్తే ప్రమాదం పెరగవచ్చు.

2026లో యూరోపియన్ సోషయటి ఆఫ్ కార్జియాలజీ ఆధ్వర్యంలో ప్రచురితమైన నిపుణుల సమీక్షలు కూడా నాయిస్ ఎక్స్ పోసర్ ను హృదయ సంబంధ వ్యాధులతో అనుసంధానించే ఆధారాలు పెరుగుతున్నాయని పేర్కొన్నాయి.

డిజె శబ్దం నేరుగా గుండెపోటు తెస్తుందా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. “డిజె శబ్దం విన్న వెంటనే గుండెపోటు వస్తుంది” అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు.

గుండెపోటు సాధారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ అర్టరీలో రక్తప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల సంభవిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో అండర లయింగ్ కరోనరీ ఆర్టరీ డీసిస్ దీనికి ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే తీవ్రమైన శబ్దం శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందన, రక్తపోటు, హృదయ స్పందనలో మార్పులను కలిగించడం ద్వారా ఇప్పటికే ఉన్న గుండె సమస్యను మరింత తీవ్రతరం చేసే ఒక ట్రిగ్గరింగ్ ప్యాక్టర్ గా పని చేయవచ్చును.

గుండెపోటు మాత్రమే కాదు…

అత్యధిక శబ్దానికి ఎక్కువసేపు గురికావడంతో చెవుల్లో మోత, వినికిడి తగ్గడం, నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు కూడా రావచ్చు. హూ డబ్ల్యుహెచ్ఒ కూడా అధిక శబ్దాన్ని కార్డియోవాస్క్యూలర్ హెల్త్ తో పాటు హియిరింగ్ హెల్త్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రమాదంగా గుర్తిస్తోంది.

డిజె దగ్గర నిలబడటం ఎందుకు ప్రమాదకరం?

భారీ స్పీకర్లకు చాలా దగ్గరగా నిలబడినప్పుడు శబ్ద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాస్ వైబ్రేషన్స్ తో పాటు ఎక్కువసేపు ఎక్స్ పోసర్ ఉంటే శరీరంపై ఒత్తిడి పెరగవచ్చు.

అందువల్ల—

స్పీకర్లకు వీలైనంత దూరంగా ఉండండి. ఎక్కువసేపు అత్యధిక శబ్దంలో ఉండకండి. చెవుల్లో మోత లేదా వినికిడి మందగించినట్లు అనిపిస్తే వెంటనే శబ్దం నుంచి దూరంగా వెళ్లండి.

గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. డిజె లేదా ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఎవరికైన ఛాతిలో బిగుతు లేదా నొప్పిగా ఉండడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం, చల్లటి చెమటలు పట్టడం, అకస్మాత్తుగా తల తిరగడం, తీవ్రమైన బలహీనత ఉండడం, వాంతులు లేదా వికారంగా అనిపించడం జరుగుతుంది. నొప్పి చేతి, భుజం, దవడ లేదా వెన్నుకు వ్యాపించడం జరుగుతుంది. వంటి లక్షణాలు కనిపిస్తే “శబ్దం వల్లే అయి ఉంటుంది” అని అనుకోకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనదే.

చివరగా…

సంబరాలు చేసుకోవడం తప్పు కాదు. కానీ మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద శబ్దంతో సంగీతం వినిపించడం కొంతమందికి వినోదంగా అనిపించవచ్చు. కానీ అదే శబ్దం మరొకరికి తీవ్రమైన శారీరక ఒత్తిడిగా మారవచ్చు. “సౌండ్ ఎక్కువైతే సంబరం ఎక్కువ” కాదు. “సౌండ్ పరిమితిలో ఉంటేనే సంబరం అందరికీ ఆనందం” ఉంటుంది. మన ఆనందం ఇతరుల ఆరోగ్యానికి ఇబ్బందిగా మారకుండా చూసుకోవడం కూడా మన సామాజిక బాధ్యత.

మీరేమంటారు?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Tags

Next Story