కుక్క కాట్లు - పిల్లల పాట్లు...

Dog bite children
X

Dog bite children

మా ఇంటి దగ్గర కారు బయటకు తీస్తుంటే ఓ ఆరవ తరగతి అమ్మాయి వచ్చి అంకుల్ మీకు ఓ విషయం చెప్పాలి అంది..

ఏంటమ్మా? అని అడిగాను..

అంకుల్ కుక్కలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రైవేట్ కు వెళ్లేటప్పుడు అవి వెంటపడుతూ ఉన్నాయి .. మీకు బాగా అధికారులు తెలుసు కదా ఒకసారి ఈ కుక్కలను ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పండి అని అనింది..

ఇంతకుముందే చెప్పానమ్మా .. వారు ఆ కుక్కలను మొన్న పట్టుకెళ్ళారు కదా.. కానీ వాటిని చంపలేరు ..వాటికి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసి మరలా ఇక్కడే వదిలేస్తారు.. అందుకనే అవి మరలా ఇక్కడే ఉన్నాయి అని చెప్పాను..

ఎందుకలా అడవిలో వదిలేయచ్చు కదా? అని అడిగింది..

వాటికి వేటాడే కెపాసిటీ ఉండదు.. అవి అడవిలో బ్రతకలేవు .. అందుకని వాటిని ఇక్కడే వదిలేస్తారు .. అవి ఎక్కడ వదిలినా కానీ అవి ఎక్కడ పెరిగాయో అక్కడికే వస్తాయి కాబట్టి మనకు తప్పదు అని చెప్పాను..

మీరు కారులో వెళ్తారు కాబట్టి మీకు వాటి వలన కలిగే బాధ తెలియదు అంకుల్ అని బాధగా చెప్పింది..

లేదమ్మా రోజు నేను వాకింగ్కు మార్నింగ్ వెళ్లినప్పుడు నాకు కూడా ఆ సమస్య ఉంది.. నేను వాకింగ్ స్టిక్ దానికోసమే పట్టుకొని వెళ్తాను.. ఈ మధ్యన భయమేసి కొంచెం వాకింగ్ కూడా మానేశాను అని చెప్పాను..

అయితే ఏం చేయలేరా అంకుల్ అని బాధగా నిష్ఠూరంగా కోపంగా ఎన్నో భావాలు వచ్చేలా ఒక నిష్టూరమైన చూపు చూసి వెళ్ళిపోయింది..

ఓ సంవత్సరం కింద మా ఇంట్లో ఓ పిల్లి ఆరు పిల్లలను పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఓ రోజు బయటి నుంచి కుక్కలు గోడ దూకి వచ్చి విచక్షణారహితంగా ఆరు పిల్లలని చంపేసేయ్.. ఆ తల్లి పిల్లి బాధ వర్ణనాతీతం..

ఈ రోజు 9 గంటల సమయంలో ఆసుపత్రిలోకి వచ్చినప్పుడు ఓ పంది పిల్లను కుక్కలు వెంటపడి నోటితో కరుసుకున్నాయి.. అదిలించిన కానీ అవి వదలలేదు.. ఎక్కడి నుంచి వచ్చిందో వాటి తల్లి పంది వచ్చి వాటితో వీరోచితంగా పోరాడింది.. అతి కష్టం మీద దానిని వదిలేసి కుక్కలు పారిపోయాయి..

చిన్న పిల్లలు చనిపోయిన సంఘటనలు మనం వార్తలలో చూస్తూ ఉంటాం..

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో?

ఇది నిజం..

భారతదేశంలో కుక్క కాట్లు, రేబీస్ స్థితి:

· ప్రపంచంలో రేబీస్ సంబంధిత మరణాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది (ప్రపంచంలోని మొత్తం రేబీస్ మరణాలలో దాదాపు 36%).

· ప్రతి సంవత్సరం సుమారు 1.7 కోట్ల మంది (17 మిలియన్ల) కుక్క కాట్లు నమోదవుతాయని అంచనా.

· వీరిలో ప్రతి సంవత్సరం సుమారు 18,000 నుండి 20,000 మంది ప్రజలు రేబీస్ వలన మరణిస్తారు (WHO డేటా ప్రకారం).

· ఈ కాట్లలో ఎక్కువ భాగం దెబ్బతిన్న (స్ట్రే) కుక్కల వలన సంభవిస్తాయి.

కుక్క కరిస్తే ఏ ఆర్ వి ఇంజక్షన్ తప్పక వేసుకోవాలి.. ఒక ఇంజక్షన్ ఖరీదు 300 రూపాయలు.. 4-6 డోసులు అవసరం.. రేబీస్ కు వైద్యంలేదు..చావే గతి.. కుక్క కరవకుండా చూసుకోవాలి.. కరిస్తే ఎఆర్వీ ఇంజక్షన్ వేసుకోవాలి..

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Tags

Next Story