పంట చేనులో నాటు బాంబు పేలి కుక్క మృతి

పంట చేనులో నాటు బాంబు పేలి కుక్క మృతి
X

కామారెడ్డి జిల్లాలో నాటుబాంబుల పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటన గర్గుల్ మండలం, గర్గుల్‌లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్‌కు చెందిన పంట చేనులో శనివారం ఉదయం సాయాగౌడ్ తమ్ముడు రామాగౌడ్ నీళ్లు పారించడానికి వెళ్లాడు. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క తల పగిలి మృతి చెందింది. చుట్టుపక్కల చూడగా పొగ రావడాన్ని గమనించి నాటుబాంబులు పేలినట్టుగా గుర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తమ పంటచేనులో బాంబులు పడేసి ఉండడంతో..దానిని ఒక కుక్క నోటితో పట్టుకోగా తల పగిలి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

తమకు హాని చేయడానికే బాంబులు పడేసి ఉంటారని సదరు రైతు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ చేనులో బాంబులు పడేసి తమకు హాని కలిగించాలని ప్రయత్నించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయాగౌడ్‌తో పాటు చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు. కాగా, పేలుడు ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అడవి పందుల కోసం ఎవరైనా పెట్టి ఉంటారా? లేదా కావాలని పెట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఈ విషయమై దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్‌ను వివరణ కోరగా.. బాంబు పేలిన ఘటన నిజమేనని, దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని అన్నారు.

Tags

Next Story