19 దేశాల ఇమిగ్రేషన్లకు ట్రంప్ బ్రేక్

19 దేశాల ఇమిగ్రేషన్లకు ట్రంప్ బ్రేక్
X

19 దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా ట్రంప్ అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఈ దేశాలు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్నాయి. దీని మేరకు ఆయా దేశాల గ్రీన్ కార్డుల ఇతరత్రా వీసాల దరఖాస్తుల పరిశీలన తరువాతి ఆమోద ప్రక్రియకు కొంతకాలం బ్రేక్ పడుతుంది. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం బుధవారం తమ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన వెలువరించింది. శాంతి భద్రతల పరిరక్షణ అంశం ఇటీవల వైట్‌హౌస్‌కు సమీపంలోనే ఇద్దరు నేషనల్ గార్డ్‌పై దుండగుడి కాల్పులతో మరింత ప్రాధాన్యతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ పాలసీలో భారీ స్థాయి ప్రక్షాళనకు ట్రంప్ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 19 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఈ మేరకు ఆ దేశాల నుంచి ఎవరూ అమెరికాకు రాకూడదు.

అమెరికా నుంచి అక్కడికి వెళ్లకూడదు. సంబంధిత దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేత నిర్ణయం ఎప్పటివరకూ అమలులో ఉంచాలి? ఎప్పుడు ఉపసంహరించుకోవాలనేది ఇమిగ్రేషన్ వ్యవహారాల అధికారిక సంస్థ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో నిర్ణయానికి వదిలిపెడుతున్నట్లు ట్రంప్ అధికార యంత్రాంగం తెలిపింది. ప్రయాణ నిషేధం, ఇప్పుడు ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేతకు గురైన దేశాలలో అఫ్ఘనిస్థాన్, కాంగో, మయన్మార్, ఛాద్, గుయానా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ , యెమెన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక ఈ దేశాలకు చెందిన వారు నిషేధం అమలుకు ముందు నుంచే అమెరికాలో ఉంటూ వస్తున్నా, అటువంటి వారిపై కూడా ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. వారి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో స్క్రూటిని చేయడం జరుగుతుందని అధికార వెబ్‌సైల్‌లో తెలిపారు.

Tags

Next Story