ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ పతకాలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ పతకాలు
X

ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం రెండు ఈవెంట్లలో మెడల్స్‌ దక్కాయి. స్కీట్ టీమ్‌ విభాగంలో భారత మహిళ, పురుష జట్లు కాంస్యం దక్కించుకున్నాయి. అటు భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ నిరాశకు గురిచేసింది. మహిళల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత త్రయం రైజా దిల్లాన్‌, మహేశ్వరి చౌహన్‌, పరినాజ్‌ ధలీవాల్‌.. 331 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. దీంతో కాంస్యం దక్కింది. ఈ ఈవెంట్‌లో చైనా బృందానికి బంగారు పతకం రాగా.. కజకిస్థాన్‌ టీమ్‌ రజతం గెలిచింది.


ఇక, పురుషుల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనంత్‌జీత్‌ సింగ్‌ నరుకా, భవతేగ్‌ సింగ్‌ గిల్‌, మైరాజ్‌ అహ్మద్ ఖాన్‌.. 346 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు. మరోవైపు, వ్యక్తిగత విభాగంలో అనంత్‌జీత్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఒలింపిక్‌లో డబుల్‌ మెడల్స్‌తో ఆకట్టుకున్న మనుబాకర్‌కు.. ఆసియా గేమ్స్‌లో నిరాశ ఎదురైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కొద్దిలో ఆమె పతకం చేజార్చుకుంది. ఫైనల్‌ పోరులో 181.1 స్కోరుతో మను ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే విభాగం టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్ల బృందం కాంస్యాన్ని త్రుటిలో మిస్‌ అయ్యింది. అటు సాఫ్ట్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు జై మీనాకు కాంస్యం దక్కింది. సెమీస్‌లో జపాన్‌ క్రీడాకారుడి చేతిలో జై 2-4తో ఓటమిపాలయ్యాడు.

Tags

Next Story