మద్యం మత్తులో తల్లిని కొట్టి చంపిన కసాయి

మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపాడు ఒక కసాయి కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గ రాములవారి వీధిలో నివాసం ఉంటున్న కూరపాటి వెంకటమ్మ (65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వీరిందరికీ వివాహాలై ఎవరికి వారు కుటుంబాలతో జీవిస్తున్నారు. పెద్ద కొడుకు రాజు ఆటో డ్రైవర్. మద్యానికి బానిస కావడంతో 15 ఏళ్ల క్రితం భార్య అతనిని వదిలి పిల్లలతో సహా నెక్కొండ మండలం, రెడ్లవాడలో ఉన్న తన తల్లి ఇంటి వద్ద నివాసం ఉంటోంది. మద్యానికి బానిసైన రాజు ఆటో నడపగా వచ్చే డబ్బులతో నిత్యం మద్యం సేవిస్తూ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని అకారణంగా మద్యం మత్తులో కొట్టేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటి వచ్చి తన తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అపస్మారక స్థితిలో ఆమె ఇంటి ఆవరణలో పడిపోవడంతో నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. శనివారం ఆ ఇంటి పక్కన ఉన్నవారు మృతురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి ఆమె చిన్నకొడుకు కూరపాటి కుమారస్వామికి సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గలో నివాసం ఉంటున్న కుమారస్వామి వచ్చి తన తల్లిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో 108కు ఫోన్‌చేయగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు నిర్ధారించారు. మృతురాలి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు ఇంతెజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
-
Home
-
Menu
