మద్యం మత్తులోబస్సు చోరీ..

మద్యం మత్తులోబస్సు చోరీ..
X

జనగామ జిల్లాలో సంచలనం రేపిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న అద్దె బస్సును తీసుకెళ్లి సుమారు 21 కిలోమీటర్లు నడిపించాడు. అనంతరం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన జిట్టబోయిన వెంకన్న డోజర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనగామకు వచ్చిన వెంకన్న మద్యం సేవించి బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో స్టార్ట్ చేసి సూర్యాపేట వైపు తీసుకెళ్లాడు. అంతకుముందు బుధవారం రాత్రి ట్రిప్ ముగించుకున్న డ్రైవర్ బస్సును జనగామ బస్టాండ్‌లో పార్క్ చేసి, తాళాలను బస్సులోనే ఉంచి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.

దీనిని గమనించిన వెంకన్న బస్సును తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 21 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద బస్సు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో అనుమానం వచ్చిన టోల్‌గేట్ సిబ్బంది వెంటనే దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకన్న మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి, బస్సుతో పాటు అతడిని అదుపులోకి తీసుకుని జనగామ పోలీసులకు అప్పగించారు. అద్దె బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. మద్యం మత్తుతో పాటు మానసిక పరిస్థితి సరిగాలేకపోవడం వల్లే వెంకన్న ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.

Tags

Next Story