దసరాకు సొంతూళ్ల బాట.. చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్!

దసరాకు సొంతూళ్ల బాట.. చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్!
X

లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు నిలిచిన వాహనాలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారుల సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: దసరా పండుగ సందడి మొదలైంది. పాఠశాలలు, కళాశాలలకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. ఆదివారం సెలవు దినం కూడా తోడవడంతో సొంత వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య పెరిగి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి.

ఫ్లైఓవర్ పనులతోనే ట్రాఫిక్ సమస్య..

ఒకవైపు పండుగ రద్దీకి తోడు, చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు ట్రాఫిక్ సమస్యను మరింత జటిలం చేశాయి. నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రధాన రహదారిపై రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో వాహనాలన్నీ ఇరుకైన సర్వీస్ రోడ్ల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలకు ఆ రోడ్లు సరిపోకపోవడంతో అవి నత్తనడకన, ఒకదాని వెంట ఒకటి నెమ్మదిగా కదులుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా దసరా సమయంలో ఉండే రద్దీ కంటే ఈసారి ఫ్లైఓవర్ పనుల వల్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి..

హైవేపై నెలకొన్న రద్దీ దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణానికి అదనపు సమయం పడుతుందని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Tags

Next Story