కొత్తగూడెంలో దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ వర్సిటీ

దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన జిల్లాల బాటలో మంగళవారం సిఎం కొత్తగూడెం జిల్లాకు రానున్నారు. ఖనిజాలకు పుట్టినిల్లు అయిన సింగరేణి ఇలాకాలో కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేసి ప్రారంభించబోతున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, విభాగాల ఏర్పాట్లు, ఆతిథ్య సదుపాయాలు, భద్రత, సభాస్థలి ఏర్పాట్లు, రవాణా నిర్వహణ వంటి అంశాలను శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణలో తొలి భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. సిఎం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం ఏరియాను విద్యారంగం అనుసంధానంతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. సింగరేణి ఇలవేల్పు కొత్తగూడెం లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ ఖ్యాతి మరింతగా పెరగనుంది .జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత సిఎంకి ప్రతిపాదన చేసి పట్టుబట్టి మంజూరు చేయించి అచరణలోకి తీసుకొచ్చారు. తుమ్మల ప్రతిపాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించి వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ తెలంగాణ క్యాబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లయింది.
పారిశ్రామిక అభివృద్ధితో విద్యను అనుసంధానం చేయాలనే ఆలోచనతోనే ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఆవిర్భవించింది. దేశంలోనే మైనింగ్ ఇంజినీరింగ్ లో రెండో కాలేజ్ గా ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ గా 1957 లో స్థాపించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జియాలజీ, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ., .ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రాక్టికల్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్...మినరల్స్ ...ఫారెస్ట్ గోదావరి నది ఉండటంతో పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మైన్ ఇంజినీర్లు ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు దేశానికి అందించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని మంత్రి తుమ్మల విశ్వాసంతో ఉన్నారు.
-
Home
-
Menu
