అమెరికాలో ముగిసిన ఆర్థిక షట్‌డౌన్..

వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో అత్యధిక కాలం 43 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక “ షట్‌డౌన్”ఎట్టకేలకు ముగిసింది. షట్‌డౌన్‌ను ఎత్తివేసే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం ) సంతకం చేశారు. అంతకు ముందు అమెరికా ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు సంతకం కోసం ఈ బిల్లు వచ్చింది. అక్టోబర్ 1నుంచి షట్‌డౌన్ వల్ల అమెరికాలో వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, ఫెడరల్ సర్వీసులు, ప్రజల జీవనాలపై , విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఎసీఏ)సబ్సిడీల విస్తరణ కోసం డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ, రిపబ్లికన్ నేతలతో రాజీ కుదరడంతో ఈ సమస్య పరిష్కారమైంది.
షట్‌డౌన్ వల్ల సుమారు 1.4 మిలియన్ ఫెడరల్ ఉద్యోగుల జీతాలు బాగా ఆలస్యమయ్యాయి. సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ( ఎస్‌ఎన్‌ఏపీ) వంటి ఆహార సహాయ పథకాలు 42 మిలియన్ అమెరికన్లకు సరిగ్గా అందకుండా పోయాయి. ఆర్థిక వృద్ధి రెండు శాతం తగ్గి, మూడు బిలియన్ డాలర్ల వరకు నష్టం కలిగించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక సర్వీసులు ఆగిపోవడంతో ప్రయాణికులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు . ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని పెంచడంతో రెండు పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చింది.
-
Home
-
Menu
