ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపు

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపు
X

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కింద తప్పనిసరి సభ్యత్వానికి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల తర్వాత ఈ వేతన పరిమితిని సవరించారు.

ఈ నిర్ణయంతో మరో 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి రానున్నారని, తద్వారా కార్మికులకు సామాజిక భద్రత మరింత విస్తరించనుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

2004 నుంచి 2014 వరకు ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు. 2014 సెప్టెంబరులో దాన్ని రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాతి కాలంలో వేతనాలు, ఆదాయాలు పెరగడంతో పాటు అధికారిక ఉద్యోగాల సంఖ్య కూడా విస్తరించిందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.11,339 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈపీఎఫ్‌ఓకు ఏటా అందిస్తున్న బడ్జెట్ మద్దతు సుమారు రూ.10,250 కోట్లుగా ఉంది. ఐదేళ్లలో ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై పడే మొత్తం అదనపు వ్యయం సుమారు రూ.56,696 కోట్లుగా అంచనా వేశారు.

Tags

Next Story