నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే గద్దె దిగాలి: ఎర్రబెల్లి దయాకర్

ఎస్సారెస్పీ కాలువ ద్వారా మైలారం రిజర్వాయర్‌తో పాటు రాయపర్తి, తొర్రూరు మండలాల్లోని చెరువులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీరు అందకపోవడంతో వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేసి రైతులకు నీరు అందించడం ప్రభుత్వానికి చేతకాకపోతే తమకు అప్పగించాలని, 15 రోజుల్లో రిపేర్లు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని సవాల్ చేశారు. రాయపర్తి మండలం మైలారం నుంచి తొర్రూరు మండలం నాంచారి మడూర్ వరకు ఎస్సారెస్పీ కాలువ వెంట రైతులతో కలిసి సోమవారం సుమారు 10 కిలోమీటర్ల మేర ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర చేపట్టారు. అనంతరం వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై సుమారు 5 వేల మంది రైతులతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వర్షాకాలంలో కాలువ ద్వారా నీరు వస్తుందనే ఆశతో రైతులు వరి నాట్లు వేశారని,
నీరు అందకపోతే ఎకరాకు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధు, పంట రుణమాఫీ, రైతుబీమా అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూరియా కొరత, విద్యుత్ సమస్యలతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎర్రబెల్లి హెచ్చరించారు. రైతులకు సాగునీరు అందే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వరంగల్, మహబూబాబాద్ జిల్లా నాయకులు, పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండల నాయకులు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
