ఎంజీఎం వద్ద మాజీ ఎంఎల్ఎ వినయ్‌భాస్కర్ పై పోలీసుల దౌర్జన్యం

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆరోగ్యశ్రీ సేవల అమలులో జాప్యం.. పేద రోగులకు ఉచిత వైద్యం అందకపోవడం.. మందులు, పరీక్షల కొరత.. పారిశుద్ధ సమస్యలపై ఫిర్యాదులు రావడంతో వినయ్ భాస్కర్ ఆస్పత్రికి వచ్చారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, కొందరు రోగుల బంధువులు ఉన్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వినయ్‌భాస్కర్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా అనుచరులతో ఆస్పత్రిలోకి వెళ్తే రోగులకు ఇబ్బందులు కలుగుతాయని, వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
దీంతో వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధిగా ఆస్పత్రిలోని పరిస్థితులను తెలుసుకునే హక్కు తనకు ఉందని, రోగుల సమస్యలు తెలుసుకోవడానికే వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందుతున్న రోగులకు కొన్ని సేవలు అందడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేయడంలో జాప్యం జరుగుతోందని వినయ్ భాస్కర్ ఆరోపించారు. పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యం కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని రోగుల బంధువులు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరత.. మందులు అందుబాటులో లేకపోవడం, పారిశుద్ధ నిర్వహణ సరిగా లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కును హరించడమేనని అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వినయ్ భాస్కర్ కొద్దిసేపు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. బిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు వారిని శాంతింపజేసి, ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనంతరం వినయ్ భాస్కర్ కొందరు నాయకులతో కలిసి అధికారులను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆస్పత్రి అధికారులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయలేదని, అర్హత ఉన్న ప్రతి రోగికి నిబంధనల ప్రకారం చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కొన్నిసార్లు పథకం అనుమతులు, సాంకేతిక ప్రక్రియ పూర్తికావడంలో జాప్యం జరుగుతోందని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం లేదని వివరించారు.
-
Home
-
Menu
